ICMR: ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలపై ఐసీఎంఆర్ మార్గదర్శకాల విడుదల
- ‘ర్యాపిడ్’ పరీక్షలు రోగ నిర్ధారణ కోసం కాదు
- హాట్‌స్పాట్లుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్వహించాలి
- వైరస్‌ను గుర్తించేందుకు పీసీఆర్ ఆధారిత పరీక్షలు మాత్రమే చేయాలి
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న పీసీఆర్ ఆధారిత పరీక్షలు మాత్రమే చేయాలని, ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ మార్గదర్శకాలు జారీ చేశారు. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత మాత్రమే తెలుస్తుందని, ఇది రోగ నిర్ధారణ కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారం రోజుల తర్వాత మాత్రమే ఈ పరీక్షలు చేయాలన్నారు.
అలాగే, హాట్‌స్పాట్లుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించేందుకు ఐసీఎంఆర్‌లో నమోదు చేసుకోవాలన్న భార్గవ.. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు కనిపించిన వారికి వారం లోపే ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు చేయాలని, అందులో పాజిటివ్ అని తేలితే వైరస్ సోకినట్టు భావించాలని, నెగటివ్ అని వస్తే మాత్రం అనుమానం ఉన్నట్టుగా పరిగణించాలని సూచించారు. పాజిటివ్ వచ్చినా, నెగటివ్ ఏది వచ్చినా కనీసం ఏడు రోజులపాటు బాధితులను క్వారంటైన్ చేయాలని బలరాం భార్గవ సూచించారు.