Indian: భారత్ కు ఈ విధంగా సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్!
- మాటెర్ హార్న్ పర్వతంపై త్రివర్ణ పతాకం వెలుగుజిలుగులు
- కరోనాపై పోరులో దేశాల పతాకాలను ప్రదర్శిస్తున్న స్విట్జర్లాండ్
- మొదటగా స్విస్ జాతీయ పతాకంతో ఆరంభం
యూరప్ ఖండంలో కరోనా మహమ్మారి బారిన పడిన దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 26,929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,327 మంది మరణించారు. అద్భుతమనదగ్గ రీతిలో 16,400 మంది కోలుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే, కరోనాపై పోరులో భాగంగా స్విట్జర్లాండ్ అనేక దేశాలకు అరుదైన రీతిలో సంఘీభావం ప్రకటిస్తోంది. సుప్రసిద్ధ ఆల్ప్స్ పర్వతశ్రేణిలోని మాటెర్ హార్న్ పర్వతంపై ఆయా దేశాల జాతీయ పతాకాలను ప్రత్యేకమైన లైటింగ్ సాయంతో ప్రదర్శిస్తోంది.
తాజాగా, భారత త్రివర్ణ పతాకాన్ని కూడా ఆకర్షణీయమైన రీతిలో ప్రదర్శించగా, జెనీవాలోని భారత విదేశాంగ సర్వీసు అధికారిణి గుర్లీన్ కౌర్ దానికి సంబంధించిన వీడియో పంచుకున్నారు. ఈ సందర్భంగా గుర్లీన్ కౌర్ 'హిమాలయాలు, ఆల్ప్స్ మధ్య స్నేహం' అంటూ వ్యాఖ్యానించారు. స్విస్ ప్రభుత్వం 4,478 మీటర్ల ఎత్తున్న సమున్నత మాటెర్ హార్న్ పర్వతంపై రాత్రి నుంచి సూర్యోదయం వరకు ఆయా దేశాల జాతీయ పతాకాలు, స్ఫూర్తిదాయక వచనాలను ప్రదర్శిస్తోంది. మొదటగా స్విట్జర్లాండ్ పతాకంతో ఈ సంఘీభావ ప్రదర్శన ప్రారంభించారు.