Corona Virus: వచ్చే ఏడాదికల్లా కరోనాకు టీకా సిద్ధం చేస్తాం: సీరం సంస్థ
- నెల రోజుల్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభం
- వాక్సిన్‌కు పేటెంట్ కూడా తీసుకోం
- సీరం సంస్థ సీఈఓ అదర్ పూర్ణావాలా వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు వచ్చే ఏడాది మొదటికల్లా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈఓ అదర్ పూర్ణావాలా తెలిపారు. టీకా కోసం తమ పరిశోధనలో ముందడుగు పడిందన్నారు. నెల రోజుల్లో మనుషులపై పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ని ప్రస్తుతం ఎలుకలు, కోతులపై ప్రయోగిస్తున్నామని తెలిపారు. తర్వాత మనుషులపై ప్రయోగాలు చేసి 2021 ప్రారంభం నాటికే పూర్తిగా అందుబాటులోకి తెస్తామని పూర్ణావాలా చెప్పారు.
ఈ టీకాకు తాము పేటెంట్ తీసుకోమని అదర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధమయ్యాక అది అవసరం ఉన్న దేశాలు వివిధ సంస్థలతో కలిసి దాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. తద్వారా అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నారు. మన కన్నా ముందు ఏ దేశం కరోనా టీకాను కనిపెట్టినా ఇదే పద్ధతిని పాటించాలని సూచించారు. కరోనా లాంటి మహమ్మారి వ్యాపించి ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ఎవ్వరూ లాభం గురించి ఆలోచించకూడదన్నారు. పరిశోధన సంస్థలు అన్ని దేశాల ప్రజల బాగుండాలని కోరుకోవాలని సూచించారు.