Punjab: పంజాబ్ లో విషాదం... కరోనాతో 10 రోజులు పోరాడి కన్నుమూసిన ఏసీపీ
- ఏప్రిల్ 7న కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఏసీపీ
- ప్లాస్మా థెరపీ నిర్వహంచాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం
- పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడిన పోలీసాఫీసర్
దేశంలోని అనేక రాష్ట్రాలను అల్లాడిస్తున్న కరోనా రక్కసి పంజాబ్ లో ఓ పోలీసు ఉన్నతాధికారిని బలి తీసుకుంది. లూథియానాలో ఏసీపీగా పనిచేస్తున్న అనిల్ కోహ్లీ కరోనాతో కన్నుమూశారు.
అనిల్ కోహ్లీ కరోనా లక్షణాలతో ఏప్రిల్ 7న లూథియానాలోని ఎస్పీఎస్ ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 13న నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విషాదకర పరిస్థితుల్లో ఆ ఏసీపీ తుదిశ్వాస విడిచారు. దీనిపై లూథియానా పోలీస్ కమిషనర్ రాకేశ్ అగర్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ ధైర్యశాలిని కోల్పోయామని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, ఏసీపీ పరిస్థితి విషమిస్తుండడంతో ఆయనకు ప్లాస్మా థెరపీ నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొహాలీకి చెందిన ఓ వ్యక్తి ప్లాస్మా దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది.