Nagarjuna: లాక్ డౌన్ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోను ఇలా ఉపయోగించాం: నాగార్జున
- లాక్ డౌన్ తో నిలిచిపోయిన చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు
- అన్నపూర్ణ స్టూడియోలో నిత్యావసర సరుకులు భద్రపరిచామన్న నాగ్
- తమ స్టూడియో ఓ బేస్ క్యాంపులా మారిందని వెల్లడి
కరోనా వైరస్ భూతాన్ని పారదోలేందుకు లాక్ డౌన్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ స్థంభించిపోయింది. దాంతో హైదరాబాదులోని పలు స్టూడియోల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అగ్రనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. లాక్ డౌన్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో మరో విధంగా ఉపయోగపడిందని తెలిపారు. టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ అందించే నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను భద్ర పరిచేందుకు గోడౌన్ లా ఉపయోగించామని వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా అన్నపూర్ణ స్టూడియో ఓ బేస్ క్యాంపుగా మారిపోయిందని, ఇక్కడి నుంచే వాహనాల్లో సరుకులను సినీ కార్మికుల వద్దకు తరలించామని, అందుకు సహకరించిన 50 మంది మెహర్ బాబా ట్రస్ట్ వలంటీర్లకు అభివందనాలు అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. మెహర్ రమేశ్ కు, దర్శకుడు ఎన్.శంకర్, వారి బృందాలకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.