Hyderabad: హైదరాబాద్ లో మద్యం ప్రియులకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు
- ఇంటి వద్దకే మద్యం అంటూ వల
- డోర్ డెలివరీ ఆఫర్ నిజమేనని నమ్మిన ఇద్దరు వ్యక్తులు
- లక్షల్లో గుంజేసిన సైబర్ నేరగాళ్లు
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో మద్యం దొరక్క మందుబాబులు వెర్రెక్కిపోతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు తెలివిగా బుట్టలో వేసుకుంటున్నారు. మీ ఇంటికే మద్యం పంపుతాం... ఆన్ లైన్ లో రుసుము చెల్లించాలంటూ సూచిస్తున్నారు.
ఇది నిజమేనని నమ్మిన కొందరు వ్యక్తులు లక్షల్లో చెల్లించి ఆపై మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమంటున్నారు. మద్యం డోర్ డెలివరీ ఆఫర్ నిజమని భావించిన యాకుత్ పురాకు చెందిన ఓ వ్యక్తి రూ.3.27 లక్షలు, మెహిదీపట్నంకు చెందిన ఇంకో వ్యక్తి రూ.48 వేలు చెల్లించారు. ఎంతకీ మద్యం రాకపోవడంతో తాము నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సైబర్ క్రైమ్ విభాగం కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది.