Vijay Sai Reddy: బాబూ... మీ ఏడుపు ఆగదు, బుద్ధి మారదు: విజయసాయి రెడ్డి!
- విశాఖలో కేసుల సంఖ్య దాచారని దుష్ప్రచారం
- కేంద్రం స్పష్టతతో ఎల్లో మీడియా అసత్యాలు తెలిశాయి
- కరోనాపై పోరాడుతున్న వారికి నిత్యావసరాలు అందించామన్న విజయసాయి
విశాఖపట్నంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం దాస్తోందని ఎల్లో మీడియా చేసిన ఆరోపణలు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటనతో అసత్యమని రుజువైనాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "వైజాగ్ లో కరోనా కేసులు దాచిపెడుతున్నారని చంద్రబాబు, పచ్చ మీడియా దుర్మార్గపు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి పెద్దగా ప్రబల లేదని వెల్లడించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బాగా గడ్డి పెట్టాడు. బాబూ! మీ ఏడుపులు ఆగవు, బుద్దులు మారవు" అని సెటైర్లు వేశారు.
అంతకుముందు "కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో అలుపెరగకుండా శ్రమిస్తున్న పారిశుద్ధ్య, పోలీసు, వైద్య సిబ్బందికి ఈ రోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని చిన వాల్తేరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది" అని మరో ట్వీట్ ను పెడుతూ, అందుకు సంబంధించిన చిత్రాలను ఆయన పంచుకున్నారు.