Tirumala: ప్రకృతి ఒడిలో మమేకమైన తిరుమల ఇప్పుడిలా... వన్య ప్రాణుల స్వతంత్రం... వీడియో!
- సప్తగిరుల్లో నెలకొన్న పచ్చదనం
- భక్తులు లేకపోవడంతో బోసిపోయిన వీధులు
- అడవులు దాటి వస్తున్న జంతువులు
- అనుక్షణం కన్నేశామన్న అధికారులు
తిరుమల పేరు చెబితే, తొలుత గుర్తుకు వచ్చేది కోట్లాది మంది ఇలవేల్పుగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే, ఆ వెంటనే స్పురించేది అక్కడి ప్రకృతి అందాలే. కొండపైకి వెళుతున్నా, కిందకు దిగి వస్తున్నా, కొండపై ఉండే పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతున్నా, సప్తగిరుల్లో నెలకొన్న పచ్చదనం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను నిలిపివేసి, భక్తులను నిలువరించడంతో, రద్దీ అమాంతం తగ్గిపోగా, సువిశాలమైన తిరుమల వీధులు బోసిపోయాయి.
జనసంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు యధేచ్చగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నాయి. పనిలోపనిగా, తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతానికి కూడా అవి వస్తూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలుగుబంట్లు సంచరిస్తున్న వీడియో వైరల్ కాగా, మరో ప్రాంతంలో చిరుతపులి కనిపించింది. ఇక కోతులు, పాముల సంచారం సరేసరి. దీంతో టీటీడీ ఫారెస్ట్ విభాగం అధికారులు స్థానిక బాలాజీ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.
జనసంచారం పూర్తిగా లేకపోవడంతోనే జంతువులు అడవుల నుంచి బయటకు వస్తున్నాయని, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. తిరుమలలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్స్ ద్వారా 50 మంది అనుక్షణం వన్యప్రాణుల కదలికలపై కన్నేశారని తెలిపారు. ఏవైనా జంతువులు వచ్చాయని గుర్తిస్తే, వెంటనే ఆ ప్రాంతానికి సిబ్బంది వస్తారని, డప్పు శబ్దాలతో పాటు, డమ్మీ గన్ లను వాడి, వాటిని తరిమేస్తామని తెలిపారు.