Cognizant: సైబర్ దాడికి గురైన కాగ్నిజెంట్
- శుక్రవారం రాత్రి కాగ్నిజెంట్ కంప్యూటర్లపై హ్యాకర్ల పంజా
- ర్యాన్సమ్ వేర్ అటాక్ అని పేర్కొన్న కాగ్నిజెంట్
- తమ వినియోగదారుల సేవల్లో అంతరాయం ఏర్పడిందని వెల్లడి
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సంస్థ సైబర్ దాడికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది ఉద్యోగులతో 15 బిలియన్ డాలర్ల సంపదతో అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న సంస్థగా కాగ్నిజెంట్ కు గుర్తింపు ఉంది. అయితే, తమ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థలపై శుక్రవారం రాత్రి సైబర్ దాడి జరిగిందని, హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్ ను చొప్పించారని కాగ్నిజెంట్ వర్గాలు వెల్లడించాయి. దీన్ని మేజ్ ర్యాన్సమ్ వేర్ అటాచ్ మెంట్ గా కాగ్నిజెంట్ పేర్కొంది.
దీని కారణంగా తమ వినియోగదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని తెలిపింది. అయితే, ఈ సైబర్ దాడి పర్యవసానాలను ఎదుర్కొనేందుకు తమ భద్రత నిపుణుల బృందం రంగంలోకి దిగిందని, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దీనిపై సమాచారం అందించామని వివరించింది. అంతేకాకుండా, సైబర్ దాడి విషయాన్ని తమ వినియోగదారులకు వెల్లడించామని, తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలను వారికి తెలియజేశామని కాగ్నిజెంట్ ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. అటు సంస్థ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ కూడా దాడి విషయాన్ని తమ ఉద్యోగులకు లేఖ ద్వారా వివరించారు.
సాధారణంగా హ్యాకర్లు ఓ సంస్థకు చెందిన, లేదా ఓ వ్యక్తికి చెందిన కంప్యూటర్ వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుని, దాంట్లోని డేటాను సురక్షితంగా అప్పగించాలన్నా, తాము చొప్పించిన వైరస్ లు తొలగించాలన్నా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుంటారు. దీన్నే ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటారు.