Donald Trump: మేం కాదు నంబర్ వన్, చైనానే నంబర్ వన్: ట్రంప్

Trump reiterates there were more deaths in China

  • మరణాల సంఖ్యను సవరించిన చైనా
  • చైనాలోనే కరోనా మరణాలు ఎక్కువన్న ట్రంప్
  • ఈ విషయంలో చైనా దరిదాపుల్లో కూడా అమెరికా ఉండదంటూ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై గుడ్లురుముతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై వాస్తవాలు దాచి, తీవ్ర జనహననానికి కారణమవుతోందంటూ డ్రాగన్ దేశంపై నిప్పులు కురిపిస్తున్నారు. తెలియక చేస్తే క్షమిస్తామని, తెలిసి చేసిందని వెల్లడైతే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, కరోనా మరణాలపై చైనా తాజాగా సవరణ చేసిందని, దాంతో చైనాలో మృతుల సంఖ్య 4600 అయిందని, చైనా తీరు చూస్తుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆ లెక్కన కరోనా మరణాల్లో అమెరికా నంబర్ వన్ అని భావించడంలేదని, చైనానే నంబర్ వన్ అని వ్యాఖ్యానించారు.

"మరణాల సంఖ్య పరంగా అమెరికా కంటే చైనా ఎంతో ముందుంటుంది, చైనా దరిదాపుల్లో కూడా అమెరికా ఉండదనుకుంటున్నా" అంటూ ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా చెబుతున్న మరణాల సంఖ్య మొదటి నుంచి నమ్మశక్యంగా లేదని మండిపడ్డారు. "చైనా అధికారిక గణాంకాలకు, వాస్తవాలకు తేడా ఉందన్న విషయం మీకు తెలుసు, వారికీ తెలుసు. కానీ మీరు ఆ వివరాలు వెల్లడించాలనుకోవడంలేదు. నిజానిజాలేంటో మీరు చెప్పాలి. ఏదో ఒకరోజు నేనే చెబుతా" అంటూ మీడియాకు కూడా హితవు పలికారు.

అమెరికాలో కరోనా రక్కసి కోరలు చాచి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 7.40 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 39 వేల మందికి పైగా మరణించారు. రోజుకు 4 వేల మంది కూడా మరణిస్తున్న దాఖలాలు అమెరికాలో సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ చైనాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News