Goa: పాజిటివ్ లన్నీ నెగటివ్... కరోనా నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా గోవా!
- గోవాలో సున్నాకు చేరిన పాజిటివ్ ల సంఖ్య
- డాక్టర్లకు, హెల్త్ వర్కర్లకు రుణపడివుంటాం
- ట్విట్టర్ లో వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి
ఇండియాలో కరోనా పాజిటివ్ లు నమోదై, ఆపై రోగులందరూ కోలుకున్న తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే, ఈ ఘనత డాక్టర్ల శ్రమ, కృషితోనే సంభవించిందని ఆయన అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి, రోగులకు చికిత్సలు అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు, వారితో కలిసి నడిచిన హెల్త్ వర్కర్లకు చాలా రుణపడివుంటాం" అని వ్యాఖ్యానించారు.
లాక్ డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటిస్తూ, ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకువెళతామని అన్నారు. సామాజిక దూరాన్ని ప్రజలు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్ లైన్స్ ను పాటించాలని పిలుపునిచ్చారు. గోవాను కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ం చీఫ్ సెక్రటరీ పరిమల్ రాయ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి నీలా మోహనన్ తదితరులు చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు.