Uttar Pradesh: కుమారుడికి, కుమార్తెకు కటింగ్ చేసిన యూపీ విద్యా మంత్రి... వీడియో!
- లాక్ డౌన్ తో మూతబడిన బార్బర్ షాపులు
- కుమార్తెకు కటింగ్ చేసిన అనుభవంతో కుమారుడికి కూడా
- నిత్యమూ దూరదర్శన్ లో పాత సీరియల్స్ చూస్తూ కాలక్షేపం
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా బార్బర్ షాపులు మూతపడగా, తన బిడ్డలకు కటింగ్ చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రాధమిక విద్యా మంత్రి సతీశ్ ద్వివేది స్వయంగా రంగంలోకి దిగారు. కత్తెర, దువ్వెన చేతపట్టి, కుమారుడికి క్రాఫ్ చేస్తున్న వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"తొలుత నా నాలుగున్నరేళ్ల కుమార్తె సుకృతికి కటింగ్ చేశాను. తొలిసారి కావడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఆపై ఎనిమిదేళ్ల కొడుకు కార్తికేయ దగ్గరికి వచ్చేసరికి కొంత అనుభవం వచ్చింది. బాగానే చేశాను" అని ద్వివేది వ్యాఖ్యానించారు. తాను కటింగ్ చేస్తుండగా, భార్య తీసిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె తీస్తున్నదన్న సంగతి తనకు తెలియదని, ఆ తరువాత వీడియోను చూసి, దాన్ని పంచుకున్నానని అన్నారు. మొత్తానికి తాను చేసిన క్షవరంతో పిల్లలు హ్యాపీగానే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక, లాక్ డౌన్ కారణంగానే ఇంట్లోనే ఉండిపోయిన తాను, నిత్యమూ యోగా చేస్తున్నానని, దూరదర్శన్ లో వస్తున్న రామాయణం సీరియల్ చూస్తున్నానని, ఆపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ ఫేస్ బుక్ లైవ్ లో ప్రజలతో మాట్లాడతానని, ఆపై మహాభారతం సీరియల్ చూస్తానని అన్నారు. ఆపై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన యూపీ ప్రజల సమస్యలు తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత రాష్ట్రాల అధికారులకు తెలియజేస్తానని అన్నారు. తాను ఇన్ చార్జ్ గా ఉన్న సోన్ భద్ర జిల్లాలో రోజువారీ పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు.