Wuhan: "ఇంపాజిబుల్"... కరోనా తమ వద్దే పుట్టిందన్న ఆరోపణలను ఖండించిన వుహాన్ ల్యాబ్ డైరెక్టర్
- వుహాన్ కేంద్రస్థానంగా విజృంభించిన కరోనా
- ఇక్కడి ల్యాబ్ లోనే కరోనా పుట్టిందంటూ ఆరోపణలు
- అలాంటి అవకాశమే లేదన్న ల్యాబ్ డైరెక్టర్
- తమ సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదని వెల్లడి
చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా భూతం ఈ వుహాన్ నగరంలోని వైరాలజీ ల్యాబ్ లోనే పుట్టిందన్నది ఓ ప్రధాన వాదన. ఇప్పటికే అమెరికా, ఆ దేశ అనుకూల మీడియా వుహాన్ లోని అక్కడి పీ4 ల్యాబ్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆ ల్యాబ్ లోనే ఈ భయంకర వైరస్ ఉత్పన్నమైందని, చైనానే అందుకు బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు తీవ్రస్థాయిలో హుంకరిస్తున్నారు. చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉండొచ్చని అంటున్నారు. ఈ విషయంలో వుహాన్ వైరాలజీ ల్యాబ్ డైరెక్టర్ వుహాన్ జిమింగ్ స్పందించారు.
తమ ల్యాబ్ అత్యంత భద్రమైనదని, ఇక్కడ వైరస్ పుట్టి, ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలే లేవని తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. "ఇంపాజిబుల్! మా ల్యాబ్ నుంచి ఇలాంటి వైరస్ లు వ్యాప్తి చెందే అవకాశమే లేదు. మా సిబ్బందిలో ఎవరూ ఈ వైరస్ బారినపడలేదు. వైరస్ లపై అధ్యయనం చేసేవాళ్లందరికీ మా ల్యాబ్ లో ఎలాంటి పరిశోధనలు జరుగుతాయో తెలుసు. మేం వైరస్ లు, శాంపిళ్ల విషయంలో ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామో కూడా తెలుసు. వైరస్ వ్యాప్తికి మా ప్రయోగశాలే కారణమని వస్తున్న కథనాలన్నీ నిరాధారం. ఎలాంటి అవగాహన లేకుండా రాస్తున్నారు. కేవలం ఊహాజనితం మాత్రమే" అని స్పష్టం చేశారు.
కాగా, చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ ఇన్ స్టిట్యూట్ లోని పీ4 ల్యాబ్ లో అత్యంత ప్రమాదకర వైరస్ లపై ప్రయోగాలు జరుగుతుంటాయి. అయితే ఈ ల్యాబ్ లో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందన్నది పాశ్చాత్యదేశాల ఆరోపణ!