Corona Virus: ‘కరోనా’ బారినపడకుండా ప్రజలపై క్రిమి సంహారకాలు వెదజల్లడం హానికరం: కేంద్ర ఆరోగ్య శాఖ
- ఈ విషయమై తమ శాఖకు ఫిర్యాదులు అందాయి
- ప్రజలపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తుంది
- ఇలా చేస్తే వైరస్ నశిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు పలు ముందుజాగ్రత్తలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్లలో ప్రజలపై క్రిమిసంహారకాలు వెదజల్లుతూ వారిని వైరస్ బారిన పడకుండా చేస్తున్నారు. దేశంలోని పలు జిల్లాల్లో స్థానిక సంస్థల అధికారులు ఈ తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
అయితే, ప్రజలపై ఈవిధంగా క్రిమిసంహారక మందులు వెదజల్లడం వారికి శారీరకంగా, మానసికంగా మంచిది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా ఈ వైరస్ సోకితే ఇలా క్రిమిసంహారకాలు స్ప్రే చేయడం ద్వారా ఆ వైరస్ నశించదని తెలిపింది. ప్రజలపై ఇలా రసాయనాలు స్ప్రే చేయడం ద్వారా వైరస్ నశిస్తుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ప్రజలను శుద్ధి చేసే నిమిత్తం వారిపై సోడియం హైపో క్లోరైడ్ వంటి రసాయనాలను చల్లడం ద్వారా ఏ మేరకు ప్రభావం ఉంటుందన్న విషయమై ప్రశ్నిస్తూ తమకు అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొంది.