KCR: తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్ డౌన్ ఉంటుంది: సీఎం కేసీఆర్
- రాష్ట్రంలో సడలింపులు ఉండవన్న కేసీఆర్
- ప్రజలే లాక్ డౌన్ కొనసాగించాలని కోరినట్టు వెల్లడి
- సర్వే చేయించానన్న కేసీఆర్
కరోనా మహమ్మారి నివారణకు తాము గతంలోనే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించామని, కేంద్రం మే 3 వరకు ప్రకటించిన లాక్ డౌన్ ఉండనే ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం రేపటి నుంచి లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్నప్పటికీ తాము మాత్రం సడలింపులు ఇవ్వబోవడంలేదని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల్లో అభిప్రాయసేకరణ జరిపించానని, ఆ సర్వేల్లో 94 నుంచి 95 శాతం మంది ప్రజలు లాక్ డౌన్ కొనసాగాలని కోరుకున్నారని వెల్లడించారు.
ఇప్పటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా చానళ్ల చర్చల్లోనూ 92 శాతం లాక్ డౌన్ పొడిగింపు అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. తాను వ్యక్తిగతంగానూ క్రాస్ చెక్ చేశానని, నియోజకవర్గాల వారీగా రైతులను, కూలీలను, ఉద్యోగులను, ఇతర రంగాల వారితో 70 మందితో మాట్లాడానని, వారందరూ ఒక్కటే ప్రశ్న అడిగారని తెలిపారు.
"మీరు లాక్ డౌన్ ఎత్తివేసినా, సడలింపు ఇస్తున్నా ఎందువల్ల ఇస్తున్నట్టు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయా? వ్యాధి నియంత్రణలోకి వచ్చిందా? అని అడిగారు. వారే నాతో అన్నారు, రాష్ట్రం కోసం మే నెలంతా లాక్ డౌన్ ప్రకటించినా ఫర్వాలేదన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించాలని ప్రకటిస్తున్నాం. మే 5న మరోసారి క్యాబినెట్ సమావేశం జరిపి తదుపరి నిర్ణయం వెల్లడిస్తాం" అని చెప్పారు.