New York: జూమ్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోండి: యువతకు గుడ్‌న్యూస్ చెప్పిన న్యూయార్క్ ప్రభుత్వం
- లాక్‌డౌన్ నేపథ్యంలో న్యూయార్క్ ప్రభుత్వం నిర్ణయం
- జూమ్‌లో పెళ్లికి చట్టబద్ధత
- ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తున్నానన్న గవర్నర్
కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివాహాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు వీడియో కాల్స్ ద్వారా పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్లు వాయిదా పడకుండా ఉండేందుకు న్యూయార్క్ ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాల్స్ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజిక దూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది.
'పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. జూమ్ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు' అని గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటించారు. న్యూయార్క్ వాసులు వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తున్నానని తెలిపారు. ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లికి సిద్ధమైన యువత గవర్నర్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో జూమ్ యాప్‌ను వాడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు, సమావేశాలు వంటివి జరుపుతున్నారు. ఇప్పుడు అదే యాప్ ద్వారా పెళ్లి చేసుకునే అవకాశాన్ని న్యూయార్క్ ప్రభుత్వం కల్పించింది. కాగా, న్యూయార్క్‌లో ఇప్పటివరకు కరోనా బారిన పడి దాదాపు 13,000 మంది ప్రాణాలు కోల్పోయారు.