Corona Virus: మా రాష్ట్రానికి పంపిన కరోనా కిట్లలో నాణ్యత లేదు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

Defective ICMR kits led to Covid19 testing delays says Bengal govt
  • ఐసీఎమ్‌ఆర్-ఎన్‌ఐసీఈడీపై ఆరోపణలు
  • అందుకే కరోనా పరీక్షల్లో జాప్యం జరుగుతోంది
  • తక్కువ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలపై సర్కారు స్పందన
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్)- కలరా, కలుషిత ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల జాతీయ సంస్థ (ఎన్‌ఐసీఈడీ) తమ రాష్ట్రానికి పంపిన కరోనా వైరస్ పరీక్షా కిట్లలో నాణ్యత లేదని మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆరోపించింది.

అందువల్లే రాష్ట్రంలో వైరస్ నిర్ధారణ పరీక్షల్లో జాప్యం జరుగుతోందని వివరించింది. బెంగాల్‌లో వైరస్ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. కిట్లలో లోపమే దానికి కారణమని తెలిపింది. ఐసీఎమ్ఆర్- ఎన్‌ఐసీడీ.. కోల్‌కతాకు పంపిన నాసిరకం కిట్ల వల్లే ఒకే నమూనాపై ఎక్కువ సార్లు నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వస్తోందని, ఇతరత్రా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పింది. అందుకే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని ట్వీట్ చేసింది.

ప్రభుత్వ ఆరోపణలపై ఎన్‌ఐసీఈడీ స్పందించింది. ‘ఇది వరకు తక్కువ సంఖ్యలో దిగుమతి చేసుకున్న కిట్ల నాణ్యతను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ) పరీక్షించి ఇతర ప్రాంతాలకు పంపించేది. కానీ, డిమాండ్‌ ఎక్కువ కావడంతో దిగుమతి చేసుకున్న కిట్లను ఐసీఎమ్‌ఆర్ నేరుగా 16  ప్రాంతీయ కేంద్రాలకు పంపిస్తోంది. అందులో కోల్‌కతా ఎన్‌ఐసీఈడీ కూడా ఒకటి. ఆయా రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలకు పంపిస్తున్న కిట్ల నాణ్యతను పరీక్షించాలి. కానీ, సమయం, సాంకేతిక పరిజ్ఞానం కొరత కారణంగా వాటికి పరీక్షలు చేయడం లేదు’ అని ఎన్‌ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్త తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా  తగినన్ని శాంపిల్స్ పంపించడం లేదన్నారు.

బెంగాల్‌లో మార్చి 17వ తేదీనే కరోనా తొలి కేసు నమోదైంది. కానీ, గత వారం నుంచే అధికారులు.. కొన్ని ప్రాంతాలను ‘హై రిస్క్ స్పాట్లు’గా గుర్తించి వాటిని దిగ్బంధించడం మొదలు పెట్టారు. దాంతో, కరోనాపై బెంగాల్ ప్రభుత్వం చాలా ఆలస్యంగా మేల్కొన్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు.
Corona Virus
testing kits
defective
ICMR
West Bengal

More Telugu News