CM Ramesh: మీడియా మొత్తం కోడై కూస్తోంది.. కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నిస్తే తప్పా?: సీఎం రమేశ్
- కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అవినీతి జరిగింది
- ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి
- అంతేగానీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేయొద్దు
- బీజేపీ పోరాడుతూనే ఉంటుంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమ్ముడుబోయి మాట్లాడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత సీఎం రమేశ్ స్పందిస్తూ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
'కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అవినీతి జరిగింది అని ప్రజలు, మీడియా మొత్తం కోడై కూస్తోంటే బాధ్యత గల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ గారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి.. అంతేగానీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి బురద చల్లడం సమంజసం కాదు' అని విమర్శించారు.
'విజయసాయిరెడ్డి గారు తమరు అధికారంలో ఉన్నారని... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తించండి. మీరెన్ని విమర్శలు చేసినా ప్రజా ప్రయోజనం విషయంలో వారి పక్షాన బీజేపీ ఏపీ పోరాడుతూనే ఉంటుంది.. ప్రశ్నిస్తూనే ఉంటుంది. కన్నా గారి మీద మీ విమర్శలను ఖండిస్తున్నాను' అని ట్వీట్లు చేశారు.