Corona Virus: దగ్గితే 2 మీటర్లు.. తుమ్మితే 8 మీటర్లు కరోనా వైరస్ ప్రయాణం!
- బాధితుడు నిశ్వాసలో ఉంటే 1.5 మీటర్ల వరకు వైరస్
- బహిరంగ ప్రదేశాల్లో గాలిలో వైరస్ ఎంత దూరం ప్రయాణిస్తుందో చెప్పిన ఆరోగ్య ఆంధ్ర
- ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వివరణ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరమే ప్రధాన అస్త్రమని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటిస్తేనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం తప్పుతుంది. లాక్డౌన్ ఉద్దేశం కూడా అదే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వ్యక్తి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వైరస్ ఎంత దూరం ప్రయాణిస్తుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేసింది.
ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చే వైరస్ ఎంతదూరంలో ఉన్న వారిని చేరే అవకాశం ఉందనే విషయాన్ని ఆరోగ్య ఆంధ్ర ట్వీట్ చేసింది. దీని ప్రకారం కరోనా బాధితుడు నిశ్వాసంలో ఉన్నప్పుడు అతని నుంచి 1.5 మీటర్ల వరకూ వైరస్ ప్రయాణిస్తుంది. అదే ఆ వ్యక్తి దగ్గినప్పుడు వైరస్ రెండు మీటర్ల వరకు వెళ్తుంది. తుమ్మినప్పుడు మాత్రం ఏకంగా ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించి.. ఆ ప్రాంతంలో ఉన్న ఇతరులకు వైరస్ సోకుతుందని తెలిపింది.
కరోనా వైరస్‌పై ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్ ఖాతాను వాడుతోంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా ఇదే.