Australia: ఆస్ట్రేలియాలో ఆర్నెల్లపాటు లాక్ డౌన్... టి20 వరల్డ్ కప్ నిర్వహణపై నీలి నీడలు!
- అక్టోబరు 18 నుంచి జరగాల్సిన టి20 వరల్డ్ కప్
- సెప్టెంబరు 30 వరకు ఆస్ట్రేలియాలో కఠిన ఆంక్షలు
- ఆ తర్వాతి పరిస్థితిపై అనిశ్చితి
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టి20 వరల్డ్ కప్ పైనా కరోనా మేఘాలు ముసురుకున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం అన్ని దేశాల కంటే కఠినంగా వ్యవహరిస్తున్న దేశం ఆస్ట్రేలియా. ఇక్కడ ఆర్నెల్ల పాటు కఠిన ఆంక్షలు విధించారు. సెప్టెంబరు 30 వరకు లాక్ డౌన్ ఉంటుంది.
ఇక టి20 వరల్డ్ కప్ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సి ఉంది. లాక్ డౌన్ తర్వాత ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లో పరిస్థితులపైనే టోర్నీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టి20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. టోర్నీ అవకాశాలు ఏమంత మెరుగ్గా కనిపించడంలేదని, ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత అని ఐసీసీ అధికారి ఒకరు చెప్పారు. ఆగస్టు లోపు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చని అన్నారు.