Vijay Mallya: విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురు
- రూ.9 వేల కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా
- 17 బ్యాంకులకు టోకరా
- తనను భారత్ కు అప్పగించాలన్న ఆదేశాలపై మాల్యా పిటిషన్
తీవ్ర ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు మరోసారి నిరాశ తప్పలేదు. సుమారు 17 బ్యాంకులకు టోకరా వేసి రూ.9000 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలపై మాల్యా భారత్ లో విచారణ ఎదుర్కొనేందుకు ససేమిరా అంటున్నాడు. తనను భారత్ కు అప్పగించాలన్న ఆదేశాలపై తాజాగా పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లైయింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును తొలుత విచారణ జరిపిన సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, భారత్ లోని సీబీఐ, ఈడీ చేస్తున్న ఆరోపణల కంటే ఈ కేసులో విస్తృత కోణాలు ఉన్నాయని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.