Meenal Viz: బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఎదుట.. గర్భిణి అయిన భారత సంతతి వైద్యురాలి నిరసన!
- బ్రిటన్ లో కరోనా విజృంభణ
- తమకు రక్షణాత్మక దుస్తుల్లేవన్న డాక్టర్ మీనాల్ విజ్
- తమకు ఎవరు భరోసా ఇస్తారని ఆవేదన
అత్యంత ప్రమాదకర కరోనా మహమ్మారి బ్రిటన్ ను సైతం పీల్చి పిప్పిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ 1,20,067 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16,060 మంది మృత్యువాత పడ్డారు. బ్రిటన్ ఆసుపత్రులు కరోనా పేషెంట్ల తాకిడిని ఎదుర్కొంటున్నాయి. కరోనా నివారణలో భాగంగా బ్రిటన్ వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భారత సంతతి వైద్యురాలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆమె పేరు మీనాల్ విజ్. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) సిబ్బందికి పీపీఈ కిట్లు తగినన్ని అందుబాటులో లేవని, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్లకార్డులు ప్రదర్శించారు. 27 ఏళ్ల మీనాల్ విజ్ ఆర్నెల్ల గర్భవతి. తన పరిస్థితిని కూడా లక్ష్యపెట్టకుండా ఆమె కరోనా రోగుల చికిత్సలో పాలుపంచుకుంటున్నారు. అయితే, వైద్యులు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. అరక్షిత పరిస్థితుల్లోనే తాము వైద్యం చేస్తున్నామని, తమ ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మీనాల్ విజ్ అంటున్నారు. లండన్ లోని ప్రధాని నివాసం, కార్యాలయం అయిన నం.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఆమె తన ఆసుపత్రి దుస్తుల్లోనే ధర్నాకు దిగారు.
కాగా, టర్కీ నుంచి పీపీఈ కిట్లు రావాల్సి ఉందని, వాటిలో 4 లక్షల మెడికల్ గౌన్లు కూడా ఉన్నాయని, తద్వారా రక్షణాత్మక దుస్తుల కొరత కొంతమేర తీరుతుందని భావిస్తున్నామని ఎన్ హెచ్ఎస్ వర్గాలంటున్నాయి.