Alla Nani: కరోనాకు భయపడి ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఇల్లు దాటి బయటికి రావడం లేదు: ఏపీ మంత్రి ఆళ్ల నాని

AP Minister slams TDP leaders in the wake of corona outbreak

  • కిట్ల వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • టీడీపీ నేతలు కరోనా దెబ్బకు ఇళ్లలో దాక్కున్నారంటూ నాని వ్యాఖ్యలు
  • కుటిల రాజకీయాలకు తెరలేపారంటూ ఆగ్రహం

కరోనా వైరస్ భారత్ లో అడుగిడిన తొలినాళ్లలోనే సీఎం జగన్ స్పందించారని, అన్ని రాష్ట్రాల కంటే ముందు మేల్కొన్నది మన ముఖ్యమంత్రేనని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఉద్ఘాటించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆయన ఈ సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

టీడీపీ నేతలు కరోనాకు భయపడి ఇళ్లలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లు దాటి బయటికి వస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనని హడలిపోతున్నారని వ్యంగ్యంగా అన్నారు. "ఓవైపు మేం ఎన్-95 మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్ల కోసం ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంటే ఆ రోజు కూడా మాపై ఆరోపణలు చేశారు. పీపీఈలు లేవు, ఎన్-95 మాస్కులు లేవంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారే నాలిక్కరుచుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చుకుందని తెలిసిన తర్వాత కొత్త బాణీ ఎత్తుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరని, క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు లేవని ఆరోపణలకు తెరలేపారు. ఈ టీడీపీ నేతలు ఏనాడైనా క్వారంటైన్ సెంటర్ కు వెళితే కదా అక్కడి పరిస్థితులు తెలిసేది? ఏ టీడీపీ నాయకుడు కూడా ఇల్లు దాటి బయటికి రాడు. కనీసం తమ ప్రాంతంలోని లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించే ధైర్యం లేదు. కరోనా దెబ్బకు ఇళ్లలో దాక్కునే టీడీపీ నేతలు డాక్టర్లు లేరు, క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల్లేవని మాట్లాడుతుంటే అది కూడా తప్పని నిరూపించాం. డాక్టర్లు సమృద్ధిగా ఉన్నారని, క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు బాగున్నాయని చూపించిన తర్వాత ఆ విషయాన్ని వదిలేస్తారు. ఇప్పుడు మళ్లీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల అంశంలో కుటిల రాజకీయాలకు తెరదీశారు" అంటూ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News