Alla Nani: చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది: ఆళ్ల నాని

Alla Nani clarifies over rapid testing kits purchase
  • ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలుపై వివరణ ఇచ్చిన మంత్రి ఆళ్ల నాని
  • రూ.65 తక్కువకే కొనుగోలు చేశామని వెల్లడి
  • ఏ రాష్ట్రం పెట్టని క్లాజ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వ్యాఖ్యలు
దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేశామని, ఒక్కో కిట్ ఖరీదు రూ.730 అని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం చేయని విధంగా పర్చేజ్ ఆర్డర్ రూపొందించే సమయంలోనే అన్ని వివరాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ విషయంలో ఆరోపణలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఓసారి వాస్తవాలను పరిశీలించాలని కోరారు. ఇదే విషయంలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతలకు వాస్తవాలు చెప్పినా ఉపయోగం లేదని, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేనని అన్నారు. తెలియనివాళ్లకు ఏదైనా చెప్పొచ్చేమో కానీ, అన్నీ తెలిసి కావాలనే బురద చల్లేవాళ్లకు ఏం చెబుతామని మంత్రి వ్యాఖ్యానించారు.

"ఇదే ర్యాపిడ్ కిట్ ను ఐసీఎంఆర్ రూ.795కి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. కానీ మేం 65 రూపాయలు తక్కువగా బేరం ఆడి రూ.730కి కొనుగోలు చేసేందుకు పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేశాం. ఇందులో కూడా ఏ రాష్ట్రం చేయని విధంగా ఓ క్లాజ్ పెట్టాం. మేం రూ.730కి కొన్న తర్వాత మీరు మరే రాష్ట్రానికైనా రూ.730 కంటే తక్కువ ధరకే అమ్మితే ఆ తక్కువ ధరనే ఏపీకి కూడా వర్తింపచేయాలని స్పష్టం చేశాం. సదరు సంస్థతో ఆ విధంగానే ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు చత్తీస్ గఢ్ కు రూ.337కే ఇచ్చినట్టు చెబుతున్నారు. రూ.337 కాదు రూ.300కే ఇచ్చినా మేం పెట్టిన క్లాజ్ కారణంగా అదే రేటు రాష్ట్రానికి వర్తింపచేయాల్సి ఉంటుంది" అని స్పష్టం చేశారు.
Alla Nani
Rapid Testing Kit
Corona Virus
Andhra Pradesh
Chandrababu
Kanna Lakshminarayana

More Telugu News