Telangana: మద్యం షాపులు తెరవండి మహాప్రభో.. 108కి ఫోన్ చేసి మొరపెట్టుకుంటున్న మందుబాబులు!

Open liquor shop please urges liquor lovers

  • 108కి ఫోన్ చేసి మద్యం షాపులు తెరవాలని కోరుతున్న వైనం
  • మానసిక సమస్యలు తలెత్తే అవకాశం వుందంటున్న వైద్య నిపుణులు
  • తలలు పట్టుకుంటున్న అధికారులు

లాక్‌డౌన్ సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్దేశించి  జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ ఫోన్ నంబరు 108కు వస్తున్న కాల్స్ చూసి అధికారులు విస్తుపోతున్నారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది మద్యం షాపులు తెరవాలని కోరుతున్నారు.

మందు లేక చనిపోవాలనిపిస్తోందని, అర్జెంటుగా దుకాణాలు తెరవాలని అభ్యర్థిస్తున్నారు. మద్యానికి బానిసైన కొందరు అది దొరక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, మరికొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారికి హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ప్రభుత్వం, అధికారుల దృష్టంతా కరోనా కట్టడి, చికిత్సపైనే ఉండడంతో ఈ విషయంపై అధికారులు పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో తమకు వస్తున్న ఫోన్ కాల్స్‌కు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని కాల్‌ సెంటర్ అధికారులు చెబుతున్నారు. కాగా, మద్యానికి బానిసైన వారు దానిని తీసుకోకపోతే మూడు వారాల తర్వాత వారిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో 20 శాతం మందిలో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News