Telangana: కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి నుంచి శాంపిల్స్ సేకరించొద్దు: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
- కరోనా లక్షణాలతో మరణించిన వారిని పాజిటివ్‌గానే పరిగణించాలని సూచన
- ఇక నుంచి ఇంటి వద్దే కరోనా పరీక్షలు
- వాహనం సిద్ధం చేస్తున్న అధికారులు
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నమూనాలు సేకరించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కరోనా లక్షణాలతో మరణిస్తే వారిని పాజిటివ్‌గానే భావించాలని అన్ని జిల్లాల వైద్యాధికారులు, సూపరింటెండ్లకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు, కరోనా వైరస్ సోకి మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఇక నుంచి ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా యోచిస్తోంది. ఇందుకోసం సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని కూడా తయారు చేస్తోంది. తొలుత ఈ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.