IYR Krishna Rao: ఈ ఆర్థిక సహాయానికి ప్రభుత్వ నిధులను వాడటం సరికాదు: ఐవైఆర్ కృష్ణారావు
- మత పరమైన సాయానికి ఆయా సంస్థల ఆదాయాన్నే వాడాలి
- ప్రభుత్వ నిధులను వాడటం రాజ్యాంగ విరుద్ధం
- టీటీడీ నిధులతో అర్చకులకు సాయం చేయవచ్చు
టీటీడీ నిధులతో అర్చకులకు ఆర్థిక సహాయం అందించవచ్చని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ విషయాన్ని తాను ఇంతకు ముందే ప్రస్తావించానని చెప్పారు. 'మత సంస్థల్లో సేవలందించే వారికి రూ.5 వేల సాయం' అంటూ వచ్చిన ఓ వార్తపై ఆయన స్పందించారు.
ఈ ఆర్థిక సహాయానికి ప్రభుత్వ నిధులను వాడటం సరికాదని అన్నారు. ఆయా మత సంస్థల ఆదాయంతోనే సాయాన్ని అందించాలని... ప్రభుత్వ నిధులతో కాదని చెప్పారు. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల అర్చకులు ఎంతమంది అనేది గుర్తించి సహాయం చేయడం సులభమని చెప్పారు. ఇతర మత సంస్థలు ప్రభుత్వ అధీనంలో లేవు కాబట్టి అధికారికంగా లబ్ధిదారులను గుర్తించడం కష్టమవుతుందని చెప్పారు.
దీంతోపాటు ఈనాడులో వచ్చిన ఓ వార్త స్క్రీన్ షాట్ ను ఐవైఆర్ షేర్ చేశారు. 'దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర మత సంస్థల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి ఈ మొత్తాన్ని ఇస్తారు' అని ఆ వార్తలో పేర్కొన్నారు.