AC: ఏసీలను నిత్యావసరాల జాబితాలో చేర్చిన పంజాబ్ కు కేంద్రం అక్షింతలు!
- ఏసీలు, కూలర్లు నిత్యావసరాలుగా పేర్కొన్న పంజాబ్
- కేంద్రం మార్గదర్శకాలు తప్పక పాటించాలన్న సుప్రీం
- పంజాబ్ సర్కారుకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను తమకు అనువుగా సడలిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఏసీల విక్రయాలు, ఏసీ యంత్రాల మరమ్మతులను నిత్యావసర సేవల్లో చేర్చింది. విద్యార్థులకు పుస్తకాల విక్రయం, ఏసీలు, కూలర్లు, వాటికి మరమ్మతులు చేసే దుకాణాలకు పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాశారు. దాంతో పంజాబ్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కితీసుకుంది. అటు, కేంద్ర హోంశాఖ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. కేరళలో కొన్నిజోన్లలో నిబంధనలు సడలించడాన్ని ప్రశ్నించింది.
కాగా, కేరళలో పలు జోన్లలో ప్రైవేటు వాహనాలకు, హోటళ్లకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని జోన్లలో వర్క్ షాపులు, బార్బర్ షాపులు, ఇద్దరు ప్రయాణికులతో కార్లకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు స్వల్ప దూరాలకు బస్సు ప్రయాణాలకు సైతం పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి లేఖ వచ్చినట్టు అర్థమవుతోంది.