Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఆసక్తికర ప్రతిపాదన చేసిన సునీల్ గవాస్కర్
- అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్
- ఆ టోర్నీని భారత్ లో నిర్వహించాలన్న గవాస్కర్
- వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఆస్ట్రేలియా స్వీకరించాలని సూచన
కరోనా వైరస్ విపత్తు ప్రపంచ క్రీడారంగాన్ని సైతం స్తంభింపజేసింది. పేరొందిన సాకర్ లీగ్ లు, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నిర్వహణ కూడా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై సరికొత్త ప్రతిపాదన చేశారు.
కరోనా కట్టడి కోసం ఆస్ట్రేలియా సుదీర్ఘంగా లాక్ డౌన్ ప్రకటించిందని, టోర్నీ ఆరంభం నాటికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై స్పష్టతలేదని అన్నారు. ఆలోపే భారత్ లో కరోనా నియంత్రణ సాధ్యమైనట్టయితే, ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించాలని సూచించారు. 2021లో టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమివ్వనున్నందున, ఆ వరల్డ్ కప్ ను ఆసీస్ తన సొంతగడ్డపై నిర్వహించుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఇది ఆతిథ్య అవకాశాలను పరస్పరం మార్చుకోవడమేనని, ఈ మేరకు ఆస్ట్రేలియా, భారత్ ఓ ఒప్పందానికి వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఇది సాధ్యమైతే, టీ20 వరల్డ్ కప్ కు కొద్దిముందుగా ఐపీఎల్ నిర్వహిస్తే భేషుగ్గా ఉంటుందని, ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీసు కూడా లభిస్తుందని వివరించారు.