Shoaib Aktar: వచ్చే ఏడాది వరకు ప్రపంచమే మూతపడితే క్రికెట్ ఎక్కడ జరుగుతుంది?: అక్తర్
- మరో ఏడాది వరకు క్రికెట్ కష్టమేనన్న అక్తర్
- ఇప్పట్లో సాధారణ పరిస్థితులను ఆశించలేమని వ్యాఖ్యలు
- దేశాలు కోలుకునేందుకు మరికొంత సమయం పట్టొచ్చని వెల్లడి
సమకాలీన పరిస్థితులపై నిశితమైన వ్యాఖ్యలు చేసే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్ పోటీల పునఃప్రారంభంపై ఆసక్తికరంగా స్పందించాడు. క్రికెట్ మ్యాచ్ లు మరో ఏడాది వరకు జరిగే పరిస్థితులు కనిపించడంలేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికీ అనేక దేశాలు కరోనాతో పోరాడేందుకు ఆపసోపాలు పడుతున్నాయని, పలు దేశాల వద్ద తగినన్ని టెస్టింగ్ కిట్లు కూడా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఎక్కడ నిర్వహిస్తారని ప్రశ్నించాడు.
ప్రపంచమే లాక్ డౌన్ అయిందని, ఇప్పట్లో సాధారణ వాతావరణం నెలకొంటుందని ఆశించలేమని పేర్కొన్నాడు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడానికి సంవత్సరం సమయం పట్టొచ్చని తెలిపాడు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బంతిపై బౌలర్లు ఉమ్మి పూసి రుద్దడాన్ని ఐసీసీ నిషేధిస్తే, ఆ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని అక్తర్ స్పష్టం చేశాడు. అయితే, కరోనా విజృంభణ చూశాక ఏ బౌలర్ కూడా బంతికి ఉమ్మి పూసేందుకు సాహసించకపోవచ్చని నవ్వుతూ అన్నాడు.