Rashtrapathi Bhavan: రాష్ట్రపతి భవన్ లో కరోనా కలకలం వట్టిదే!.. నిజం లేదంటున్న అధికారులు

Officials said no corona cases in Rashtrapathi Bhavan

  • రాష్ట్రపతి భవన్ ఉద్యోగులకు కరోనా అంటూ ప్రచారం
  • ఎవరికీ సోకలేదన్న రాష్ట్రపతి మీడియా కార్యదర్శి
  • కరోనా వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, దాంతో 100 మంది ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించారని ఈ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పష్టతనిచ్చాయి.

 రాష్ట్రపతి భవన్ లో ఎవరికీ కరోనా సోకలేదని రాష్ట్రపతి మీడియా కార్యదర్శి నిమిష్ రస్తోగీ తెలిపారు. ఇటీవల సెంట్రల్ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఏప్రిల్ 13న కరోనాతో మరణించాడు. ఆ వ్యక్తి రాష్ట్రపతి భవన్ లో పనిచేసే వ్యక్తి అంటూ ప్రచారం జరిగిందని, అతడికి, రాష్ట్రపతి భవన్ కు ఎలాంటి సంబంధం లేదని రస్తోగీ స్పష్టం చేశారు.

అలాగే, రాష్ట్రపతి భవన్ ఉద్యోగి కుటుంబ సభ్యుడొకరు కరోనా రోగిని కలిసినట్టు తెలియడంతో అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించామని, వారిలో ఎవరికీ కరోనా నిర్ధారణ కాలేదని తెలిపారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005 యొక్క సూచనలు మరియు మార్గదర్శకాలను అనుసరించి, ప్రెసిడెంట్ ఎస్టేట్, పాకెట్ 1, షెడ్యూల్ ఏ ప్రాంతంలోని 115 ఇళ్లలో నివసించే ప్రజలను ఇళ్ల లోపలే  ఉండాలని సూచించామని, ఈ గృహాల నివాసితులకు అవసరమైన వస్తువులను ఇంటింటికీ అందజేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News