Kerala: కొన్ని గంటల సడలింపుతో... కేరళలో పరిస్థితి రివర్స్!
- ఇటీవల కేరళలో లాక్ డౌన్ సడలింపు
- తెరచుకున్న రెస్టారెంట్లు, స్టేషనరీ దుకాణాలు
- ఒక్కసారిగా బయటకు వచ్చిన ప్రజలు
- ఒక్కరోజులో 19 కేసుల నమోదు
కరోనా కట్టడిలో తాము విజయం సాధించామని, ఓ దశలో దేశంలోనే అత్యధిక కేసులున్న రాష్ట్రంగా నిలిచినా, ఇప్పుడు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 100 లోపే ఉందని ఊపిరి పీల్చుకున్న కేరళలో కొన్ని గంటల వ్యవధిలో పరిస్థితి రివర్స్ అయింది. మంగళవారం ఒక్కరోజులో కేరళలో కొత్తగా 19 కరోనా కేసులు వచ్చాయి. శక్క కన్నూర్ లోనే 10 కేసులు నమోదయ్యాయి. పాలక్కాడ్ లో 4, కాసర్ గోడ్ లో 3, మలప్పురం, కొల్లాం ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది.
ఇక ఉన్నట్టుండి కేసులు పెరగడానికి లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన సడలింపే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. కేసులు తగ్గిన కారణంగా, లాక్ డౌన్ నుంచి పినరయి సర్కారు మినహాయింపులను ప్రకటించింది. సరి - బేసి విధానంలో వాహన సంచారానికి అనుమతించింది. దీంతో సెలూన్లు, రెస్టారెంట్ లు, స్టేషనరీ దుకాణాలు తెరచుకోగా, ప్రజలు గుంపులు గుంపులుగా బయటకు వచ్చారు. ఆపై కేరళ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం వెనక్కు తగ్గి, ఇచ్చిన సడలింపులను వెనక్కు తీసుకుంది.
ఇప్పుడు కేసుల సంఖ్య తిరిగి పుంజుకోవడంతో, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ ట్రేస్ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కొత్త కేసుల్లో అత్యధికులకు ట్రావెల్ హిస్టరీ ఉందని వెల్లడించిన సీఎం, కరోనా లక్షణాలు కనిపించకపోయినా, మార్చి 12 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారందరికీ టెస్టులు చేశామని వెల్లడించారు. కన్నూర్ లో ప్రజలు నిబంధనలను మీరుతున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆయన, ప్రజలు మే 3 వరకూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.