Vijayawada: పెట్రోల్ బంకులో 'ముసుగువీరులు'.. కరోనా కట్టడిపై పోలీసుల జాగ్రత్తలు!
- విజయవాడ పోలీస్ పెట్రోల్ బంక్ సిబ్బందికి కోవిడ్19 రక్షణ దుస్తులు
- కరోనా సోకే అవకాశాల దృష్ట్యా అధికారుల ముందు జాగ్రత్త
- ఒళ్లంతా మూసివుండేలా డ్రెస్, మాస్క్, గ్లౌజులు
చూశారుగా ఈ చిత్రాన్ని. ఇందులో కనిపిస్తున్న ఈ ముసుగు వీరులు ఎవరా? అన్నదేగా మీ సందేహం. అది సహజమేలే. కోవిడ్ 19 విస్తరణ నేపథ్యంలో బహుశా డాక్టర్లో, ఇతర వైద్య సిబ్బందో అయివుంటారని ఊహించుకుంటున్నారా? అదే నిజమైతే... మీరు ‘తప్పు’లో కాలేసినట్టే. కరోనా రక్షణ దుస్తులతో కనిపిస్తున్న వీరంతా ఏ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులో, క్వారంటైన్ సెంటర్ సిబ్బందో కాదు. విజయవాడలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. ఏంటి...అవాక్కయ్యారా?
నిజమేనండి. అసలే పోలీసులు నిత్యం కరోనా కట్టడి విధుల్లో ఉంటున్నారు. పోలీసు వాహనాలు అనునిత్యం రెడ్‌జోన్లతో సహా అన్ని ప్రాంతాల్లో తిరిగి వస్తుంటాయి. అటువంటి వాహనాలు, తిరిగే వ్యక్తులు నిత్యం వచ్చే పెట్రోల్ బంక్‌లో ఆ మాత్రం రక్షణ చర్యలు లేకుంటే ప్రమాదమే కదా. సరిగ్గా ఇదే ఆలోచన విజయవాడ పోలీసు పెద్దలకు వచ్చింది.
ఇంకెందుకు ఆలస్యం అనుకున్నారు. పెట్రోల్ బంక్‌లో పనిచేసే సిబ్బందికి (వారూ పోలీసులే) తల నుంచి కింది దాకా మూసుకుని ఉండేలా ప్రత్యేక దుస్తులు సమకూర్చారు. మాస్క్‌లు, గ్లౌజులతోపాటు తరచూ చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు కూడా ఇచ్చారు. అదండీ ఈ చిత్రం కథ.