Vijay Sai Reddy: ఎన్నికల నిధులు రూ.30 కోట్లు నొక్కేసినట్టు అప్పట్లో పత్రికలలో వార్తలొచ్చాయి: కన్నాపై విజయసాయిరెడ్డి మరో ట్వీట్
- నిధులు గోల్‌మాల్ జరిగినట్టు వారి పార్టీయే గుర్తించింది
- దీనిపై అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి
- కొత్తగా చేరిన నేతలతో కన్నా వాటిని పంచుకున్నారు
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అధిష్ఠానం ఇచ్చిన ఎన్నికల నిధులు 30 కోట్ల రూపాయలను లక్ష్మీనారాయణ నొక్కేసినట్టు, అధిష్ఠానం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లోనే పత్రికలలో వార్తలొచ్చాయని అన్నారు. కొన్నిరోజులుగా కన్నా, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.
కరోనా కిట్ల కొనుగోలులో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కన్నా ఆరోపిస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన కన్నా వారి మాటలనే తన మాటలుగా వల్లెవేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఇరు పార్టీల మధ్య హీట్ పెంచాయి. ‘కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేస్తారా?’ అంటూ ఇద్దరు నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నాతో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అప్పట్లో నిధులు గోల్‌మాల్‌పై వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ను కూడా ఆయన జోడించారు.