Guntur District: చిలకలూరిపేటలో తొలి కేసు.. వైద్యురాలికి కరోనా
- జిల్లాలో నేడు కొత్తగా 19 కేసులు
- ఒక్క గుంటూరులోనే 106 కేసులు
- గుంటూరు, నరసరావుపేటల నుంచి రాకపోకలు బంద్
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నేడు గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకుని ఒక్క గుంటూరు నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య 106కు పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు, నరసరావుపేటలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు.