Corona Virus: ఈ 12 లక్షణాల్లో ఏది కనిపించినా కరోనా పాజిటివ్ ఉండే అవకాశం ఉందట!
- విరేచనాలు, తలనొప్పి, వికారం కూడా లక్షణాలే
- కొందరిలో ఒకే లక్షణం కనిపించినా వైరస్ పాజిటివ్
- వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, అవి కరోనా లక్షణాలని మనకు అందరికీ తెలుసు. ఈ లక్షణాలు ఉన్న వారు వైద్యుల వద్దకు వస్తే, కరోనా టెస్టింగ్ కు డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. అయితే, ఇవి మాత్రమే వైరస్ లక్షణాలు కాదని, కరోనా మొత్తం 12 లక్షణాలను చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఏ లక్షణం ఎంత శాతం మేరకు శరీరంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, మానవ శరీరంపై కరోనా వైరస్ కారణంగా 88 శాతం మందికి జ్వరం వస్తుంది. ఇక పొడిదగ్గు 68 శాతం మందిలో, అలసట 38 శాతం మందిలో, శ్లేష్మ దగ్గు 33 శాతం మందిలో కనిపిస్తాయి. వీటితో పాటు శ్వాస సమస్య 19 శాతం మందిలో, కండరాల నొప్పి 15 శాతం మందిలో, గొంతునొప్పి, తలనొప్పులు 14 శాతం మందిలో, చలిగా అనిపించడం 11 శాతం మందిలో ఉంటుంది. వికారం, ముక్కులో ఇబ్బంది 5 శాతం మందికి, విరేచనాలు 4 శాతం మందిలో కనిపించవచ్చని తెలిపింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కొందరికి ఒక లక్షణమే బయటకు కనిపిస్తోందని, మరికొందరిలో మూడు, నాలుగు లక్షణాలు కనిపించాయని, అందుకని వీటిల్లో ఏ లక్షణం రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నా, కరోనా పరీక్షలు చేయిస్తేనే మంచిదని సిఫార్సు చేసింది.