COVID-19: కరోనా గురించి మరో షాకింగ్ విషయం.. 30 జాతులుగా పరివర్తన చెందిన వైరస్
- వివిధ మార్పులకు గురవుతున్న సార్స్ కోవ్-2
- చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
- దీనిని నివారించే క్రమంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని ఆందోళన
కరోనా మహమ్మారికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ సార్స్ కోవ్-2 జన్యుపరంగా వివిధ మార్పులకు గురైందని, ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా ఇది పరివర్తనం చెందిందని చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. హాంగ్జవూలోని జెజియాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లి లాంజువాన్ తన సహచరులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
హాంగ్జవూ ప్రాంతంలో ఉన్న మొత్తం 1264 మంది బాధితుల్లో 11 మంది నుంచి సేకరించిన నమూనాల్ని పరిశీలించిన అనంతరం 30 జాతులుగా వున్న ఈ వైరస్ పరివర్తనాన్ని గుర్తించారు. వీటిలో 19 జాతులు ఇంతకుముందు అస్సలు లేవు. సార్స్ కోవ్-2 తన జన్యుక్రమాన్ని మార్చుకుని పరివర్తన చెందే శక్తిని కూడగట్టుకుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.
అలాగే ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా విజృంభిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని పరివర్తనం చూస్తుంటే ఇది మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ భూమ్మీది నుంచి దీనిని పూర్తిగా నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రొఫెసర్ లాంజువాన్ ఆందోళన వ్యక్తం చేశారు.