America: అమెరికాలో మరో కలకలం.. రెండు పెంపుడు పిల్లులకు కరోనా
- న్యూయార్క్ జూలోని సింహాలు, పులులకు ఇప్పటికే కరోనా
- ఇప్పుడు పెంపుడు పిల్లులకు సోకిన మహమ్మారి
- శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పిల్లులు
కరోనాతో అల్లాడుతున్న అమెరికాను ఇప్పుడు మరో వార్త వణికిస్తోంది. తొలిసారి రెండు పెంపుడు పిల్లులకు కరోనా సోకిందన్న విషయం సంచలనమైంది. కరోనాకు కేంద్రంగా మారిన న్యూయార్క్‌లో రెండు పిల్లులకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యాధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ (ఎన్‌వీఎస్ఎల్) ధ్రువీకరించాయి.
కరోనా బారినపడిన రెండు పిల్లులు శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో పరీక్షించగా వాటికి కరోనా వైరస్ సోకిన విషయం బయటపడింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిలో పెంపుడు జంతువుల పాత్ర ఉండే అవకాశం లేదని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ పిల్లులను పెంచుకుంటున్న వారి కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా సోకిన బయటి వ్యక్తుల నుంచి వీటికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, న్యూయార్క్ జూలో ఎనిమిది సింహాలు, పులులకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే.