Mukhesh Ambani: మరోసారి జాక్ మాను అధిగమించిన ముఖేశ్ అంబానీ.. నిన్న ఒక్కరోజే భారీగా పెరిగిన సంపద
- రిలయన్స్ జియోలో రూ. 43,574 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఫేస్ బుక్
- నిన్న 10 శాతం వరకు పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు
- 49.2 బిలియన్ డాలర్లకు చేరుకున్న ముఖేశ్ సంపద విలువ
చైనా ఈకామర్స్ సంస్థ 'అలీబాబా' అధినేత జాక్ మాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి అధిగమించారు. ఫేస్ బుక్-రిలయన్స్ జియో మధ్య భారీ డీల్ కుదిరిన నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ నిన్న ఏకంగా 10 శాతం వరకు పెరిగింది.
దీంతో, ముఖేశ్ సంపద విలువ నిన్న ఒక్కరోజే 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ క్రమంలో, ఆయన సంపద 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, జాక్ మా సంపద కంటే 3.2 బిలయన్ డాలర్ల ఎక్కువ సంపదతో ముఖేశ్ మరోసారి ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా అవతరించారు. రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు 10 శాతం వాటాకు సమానం.
మరోవైపు, ఫేస్ బుక్ తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీని ప్రశంసిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయనేదానికి ఇది నిదర్శనమని అంటున్నారు. కరోనా ఉపద్రవం ముగిసిన తర్వాత ప్రపంచ పెట్టుబడులకు భారత్ కేంద్ర స్థానం అవుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. 'బ్రావో ముఖేశ్' అని కొనియాడారు.