Rohit Dua: ప్రాణాయామం చేయండి.. బాగా ఉపయోగపడుతుంది: ఢిల్లీలో కరోనా నుంచి స్వస్థత పొందిన తొలి వ్యక్తి సలహా

Pranayamam is Best in Speedy Recovery of Corona Patients

  • ఫిబ్రవరిలో యూరప్ నుంచి వచ్చిన రోహిత్ దువా
  • ఆపై కరోనా సోకిన తొలి ఉత్తర భారతీయుడిగా గుర్తింపు
  • చికిత్స  సమయంలో ప్రాణాయామం చేశా
  • కరోనా రోగుల్లో ఆందోళన తగ్గుతుందని సలహా

రోహిత్ దువా (45)... న్యూఢిల్లీలో తొలి కరోనా పాజిటివ్. వ్యాపార పనుల నిమిత్తం యూరప్ కు వెళ్లి, ఫిబ్రవరి 24న రోహిత్ తిరిగి వచ్చారు. ఆపై స్వల్పంగా జ్వరం రాగా, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాగా, వెంటనే అతన్ని క్వారంటైన్ చేశారు. ఆపై వైద్యులు చేసిన చికిత్సతో రోహిత్, పూర్తిగా కోలుకున్నారు. తనకు వైద్యులు అందించిన చికిత్సతో పాటు యోగాలో భాగమైన ప్రాణాయామం కూడా కోలుకునేందుకు సహకరించిందని ఆయన వ్యాఖ్యానించారు.

"కొవిడ్-19 బాధితులు ప్రాణాయామం చేయాలని నేను సూచిస్తున్నాను. రికవరీలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులోని ఆందోళన సైతం తగ్గుతుంది. నాకు వైరస్ సోకిందని తెలియగానే నన్ను క్వారంటైన్ చేశారు. ఇంటికి వెళ్లడానికి ఆసుపత్రి వర్గాలు అనుమతించలేదు. ఆసుపత్రిలోనే నా అవసరాలన్నీ తీర్చారు. ఉత్తర భారతావనిలోనే కరోనా సోకిన తొలి పేషంట్ ను నేను. ప్రతి డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. వారు చేయగలిగిందంతా చేశారు" అని రోహిత్ దువా వ్యాఖ్యానించారు.

కరోనా సోకిన వారు సానుకూల దృక్పథంతో ఉండాలని, డాక్టర్లు, ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాలని రోహిత్ ఈ సందర్భంగా సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, మానసికంగా బలంగా ఉంటే, ఎలాంటి వైరస్ ను అయినా తరిమికొట్టవచ్చని పిలుపునిచ్చారు. కరోనాను తరిమి వేయడానికి ఎంతగానో కృషి చేస్తున్న డాక్టర్లపై దాడులు జరిగాయన్న వార్తలు తనను బాధించాయని రోహిత్ అన్నారు.

  • Loading...

More Telugu News