Antonio Guterres: కరోనా ఇప్పుడు మానవ సంక్షోభం... మున్ముందు మానవ హక్కుల సంక్షోభం కాబోతోంది: ఆంటోనియో గుటెర్రాస్
- కరోనా విపత్తుపై గుటెర్రాస్ వీడియో సందేశం
- కొన్ని సామాజిక వర్గాలపై దుష్ప్రభావం పడుతోందని వెల్లడి
- సాయం అందరికీ అందడంలేదని వ్యాఖ్యలు
ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ కరోనా వైరస్ విలయంపై వీడియో సందేశం అందించారు. కరోనా ఇప్పుడు మానవ సంక్షోభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇది మానవ హక్కుల సంక్షోభంగా రూపుదాల్చుతుందని, ఆ దిశగా ఈ మహమ్మారి వేగంగా అడుగులు వేస్తోందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సహాయకచర్యలు, సేవల్లో వివక్ష కనిపిస్తోందని, కొన్ని వర్గాలకు సాయం అందడంలో నిర్మాణాత్మక అసమానతలు అడ్డుపడుతున్నాయని వివరించారు.
కరోనా విపత్తు వేళ కొన్ని సామాజిక వర్గాలపై దుష్ప్రభావం పడుతోందని, విద్వేష ప్రసంగాలు చోటుచేసుకుంటున్నాయని, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం పెరుగుతోందని, భద్రతా పరమైన సమస్యలు ఆరోగ్య అత్యయిక స్థితిని మరుగున పడేస్తున్నాయని గుటెర్రాస్ ఆందోళన వెలిబుచ్చారు. జాతి ఆధారిత జాతీయవాదం, వర్గ జనాభా ఆధిక్యత, నిరంకుశవాదం పెరుగుదల తదితర అంశాలు కొన్నిదేశాల్లో మానవ హక్కుల తిరోగమనానికి కారణమవుతున్నాయని వివరించారు.