Michael Vaughan: కేపీకి ఐపీఎల్ లో భారీ ధర పలకడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అసూయపడ్డారు: మైఖేల్ వాన్
- ప్రపంచస్థాయి బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకున్న కెవిన్ పీటర్సన్
- దక్షిణాఫ్రికాలో జన్మించినా ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం
- కెరీర్ చరమాంకం వివాదాస్పదం
- సొంతజట్టులోనే వ్యతిరేక వర్గం
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కెవిన్ పీటర్సన్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. దక్షిణాఫ్రికాలో జన్మించినా ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడి ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే వివాదాస్పద రీతిలో కెరీర్ ముగించినా, అప్పటికే ప్రపంచస్థాయి బ్యాట్స్ మన్ గా ఘనతకెక్కాడు. సొంత జట్టులోనే వ్యతిరేక వర్గంతో పోరాడాల్సి రావడం అతడి కెరీర్ చివరి దశలో తీవ్ర ఒడిదుడుకులకు కారణమైంది. కేపీగా ఎంతో ఫేమస్ అయిన ఈ పొడగరిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
గతంలో పీటర్సన్ ను ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపాడు. తమలో ఒకడిగా ఉన్న కేపీకి ఐపీఎల్ లో భారీ కాంట్రాక్టు లభించడం పట్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈర్ష్య పడ్డారని, అతడిపై మరింత ప్రతికూల భావనలు పెరిగేందుకు ఐపీఎల్ అవకాశం కూడా ఓ కారణమైందని వాన్ వివరించాడు. అప్పటికే గ్రేమ్ స్వాన్, టిమ్ బ్రేస్నన్, జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్, మాట్ ప్రయర్ వంటి ఆటగాళ్లు ఓవైపు, పీటర్సన్ ఒక్కడే ఓవైపు ఉండేవారని వెల్లడించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరింతగా రాణించాలంటే ఐపీఎల్ ఓ మార్గమని అతను ముందే గ్రహించాడని, ఇదే విషయాన్ని జట్టుతో కూడా చెప్పాడని వాన్ తెలిపాడు. అయితే, తమకు ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కకపోవడం, కేపీకి భారీగా ధర పలకడంతో ఇంగ్లాండ్ జట్టులో వర్గపోరు తీవ్రమైందని పేర్కొన్నాడు.
2012లో ఓ సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల గురించి కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికా జట్టుకు మొబైల్ సందేశాలు పంపడంతో అతడిపై వ్యతిరేకతకు ఆజ్యం పోసింది. అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తో కేపీకి విభేదాలు పొడసూపాయి. అక్కడి నుంచి కేపీ ఇంగ్లాండ్ జట్టుకు ఆడడం తగ్గించి, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లు ఆడడంపై దృష్టి సారించాడు.