China: అమెరికా ఇకనైనా బెదిరింపులు మానుకోవాలి: చైనా
- తమపై ఆరోపణల్లో నిజంలేదన్న చైనా రాయబారి
- కరోనా విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి
- అమెరికా ఇంకా పాతరోజుల్లోనే బతుకుతోందని వ్యాఖ్యలు
కరోనా వ్యాప్తిపై తాము అనేక విషయాలను దాచిపెడుతున్నామంటూ తమపై అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా కొట్టిపారేసింది. కరోనా వైరస్ విస్తరణకు సంబంధించిన ఏ వివరాలను చైనా కప్పిపుచ్చుకోలేదని, అమెరికా ఇకనైనా బెదిరింపులు మానుకోవాలని బ్రిటన్ లో చైనా రాయబారి లియు జావోమింగ్ స్పష్టం చేశారు.
"చైనా గురించి ఎంతో దుష్ప్రచారాన్ని వింటున్నాం. చైనా మసిపూసి మారేడుకాయ చేస్తోందని, చైనా దాచిపెడుతోందని వస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం లేదు. చైనా ప్రభుత్వం కరోనా విషయంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఇతర దేశాలతో సత్వరమే సమాచారాన్ని పంచుకుంటోంది. కానీ, ఓ ఇతర దేశంలో అక్కడి కోర్టులు చైనాపై దావాలు వేయడం అర్థరహితం.
కొందరు ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తున్నారు. ఇవి బెదిరించి పబ్బం గడుపుకునే రోజులు కావు. ఇప్పుడున్న చైనా నాటి వలసవాద, భూస్వామ్య తరహా చైనా ఎంతమాత్రం కాదు. కానీ వీళ్లు మాత్రం ఇంకా పాత రోజుల్లోనే బతుకుతున్నారు. చైనాను బెదిరించగలం అనుకుంటున్నారు. తద్వారా ప్రపంచాన్నే శాసించగలం అని భ్రమపడుతున్నారు. చైనా... అమెరికాకు ఎంత మాత్రం శత్రువు కాదు. ఒకవేళ చైనాను వారు శత్రువుగానే భావిస్తే రాంగ్ టార్గెట్ ను ఎంచుకున్నట్టే" అంటూ లియు జావోమింగ్ స్పష్టం చేశారు.