America: అమెరికాలో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న వైరస్!
- గత వారంతో పోలిస్తే నెమ్మదించిన కేసులు, మరణాల సంఖ్య
- ఆంక్షలను సడలించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్రాలు
- అమెరికాపై దాడి జరిగిందన్న ట్రంప్
అమెరికాలో నెమ్మదించినట్టు కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ బారినపడిన వారిలో నిన్న మళ్లీ 2,416 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడో రోజు 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాకున్నా, గత వారంతో పోలిస్తే మరణాలు, కేసుల సంఖ్యలో కొంత తగ్గుముఖం కనిపిస్తోంది. కరోనా బారి నుంచి ఒక్కో రాష్ట్రం కోలుకుంటోందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, వైరస్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రాలు నిషేధాజ్ఞలను సడలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
మరోపక్క, ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. చైనా సహా ఎవరికీ లేనంతటి గొప్ప ఆర్థిక వ్యవస్థ అమెరికా సొంతమని, మూడేళ్లుగా దీనిని నిర్మించుకున్నామని అన్నారు. వైరస్ రూపంలో అకస్మాత్తుగా తగిలిన దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత డబ్బు ఖర్చు చేయక తప్పడం లేదన్నారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 8.80 లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మరణాలు 50 వేలకు చేరువయ్యాయి. 85 వేల మందికిపైగా కోలుకున్నారు.