Hyderabad: లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైదరాబాద్‌‌లో గృహ విక్రయాల్లో భారీ క్షీణత

Lockdown Effect Huge decline in home sales in Hyderabad
  • జనవరి-మార్చి త్రైమాసికంలో 39 శాతం తగ్గిన విక్రయాలు
  • ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ ఇదే కొనసాగే అవకాశం
  • వెల్లడించిన ప్రోప్ టైగర్ నివేదిక
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్‌లోని స్థిరాస్తి రంగంపై తీవ్రంగా పడింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నగరంలో ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు ఏకంగా 39 శాతం మేర క్షీణించాయి. హైదరాబాద్ సహా 9 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, కోల్‌కతా, ముంబై, పూణె, నోయిడాలలో గతేడాదితో పోలిస్తే ఈసారి పైన పేర్కొన్న త్రైమాసికంలో విక్రయాలు 26 శాతం పడిపోయినట్టు ప్రోప్ టైగర్ డాట్ కామ్ అనే సంస్థ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 93,936 గృహాలు అమ్ముడుపోగా, ఈసారి ఆ సంఖ్య 69,235కు పడిపోయినట్టు ఆ సంస్థ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తోంది.

అలాగే, గతేడాది జనవరి-మార్చి మధ్య 72,932 కొత్త ఫ్లాట్లు అందుబాటులోకి రాగా, ఈసారి అదే సమయంలో 35,668 ఫ్లాట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. గృహ అమ్మకాలపై కరోనా వైరస్ ప్రతికూల ప్రభావం బాగా కనిపించిందని ప్రోప్ టైగర్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఈ ప్రభావం ఒక్క స్థిరాస్తి రంగంపైనే లేదని, దాదాపు అన్ని రంగాలు ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ ఈ క్షీణత కొనసాగే అవకాశం ఉందన్నారు.
Hyderabad
Real Estate
Corona Virus

More Telugu News