Tamil Nadu: తమిళనాడులోని పూంపుహార్లో భయం భయం.. అకస్మాత్తుగా నేలరాలుతున్న కాకులు!
- 50 కాకులు, మూడు కుక్కలు మృతి
- శాంపిళ్లు సేకరించిన అధికారులు
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్ ప్రజలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. నిన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా 50 కాకులు, మూడు కుక్కలు మృతి చెందడమే ఇందుకు కారణం. అసలే కరోనా వైరస్ కారణంగా బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఈ పరిణామం మరింత భయాందోళనలు నింపింది.
శునకాలు, కాకుల మృతి విషయాన్ని గ్రామ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు చేరవేశారు. గ్రామానికి చేరుకున్న అధికారులు చనిపోయిన శునకాలు, కాకుల నుంచి నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం వాటి మృతికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. మరోవైపు, వీటిపై విష ప్రయోగం జరిగిందా? అనే విషయమై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జంతువులకు కూడా కరోనా వైరస్ సోకుతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మృతి స్థానికులను మరింత భయాందోళనలోకి నెట్టేసింది.