Gilead: కరోనాకి మందుగా భావించిన 'రెమడీసివిర్' రోగులపై ప్రయోగంలో విఫలం!
- జిలీడ్ సైన్సెస్ తయారు చేసిన డ్రగ్ పై ఎన్నో ఆశలు
- పనితీరును పరిశీలించిన ప్రపంచ దేశాలు
- పరిశీలనకు 237 మంది రోగులు
- వెల్లడించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
కరోనాను అడ్డుకుంటుందని భావించిన అమెరికా ఫార్మాస్యూటికల్ సంస్థ 'జిలీడ్ సైన్సెస్' ఉత్పత్తి 'రెమడీసివిర్' విఫలమైంది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లోనే 'రెమడీసివిర్' పనికిరాదని తేలిపోయిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన అధికార వెబ్ సైట్ లో ముసాయిదా నివేదికను ప్రచురించింది. ఈ డ్రగ్ పనితీరు మానవులపై ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా నిశితంగా పరిశీలించిన వేళ, దీన్ని వాడిన తరువాత సానుకూల ఫలితాలు రాలేదని తెలుస్తోంది.
కాగా, ఈ మెడిసిన్ ను తయారు చేసిన జిలీడ్ సైన్సెస్ మాత్రం, తమ మందు విఫలం కాలేదని, దీని వల్ల ఎంతో ఉపయోగముందని తేలిందని వ్యాఖ్యానించింది. కాగా, చైనాకు చెందిన మొత్తం 237 మంది కరోనా రోగులను ఈ ప్రయోగంలో అధ్యయనానికి తీసుకున్నారు. వీరిలో 158 మందికి రెమడీసివర్ మందు ఇవ్వగా, 79 మంది రోగులకు ఈ మందు ఇవ్వకుండా పరిశీలించారు. వీరిలో తొలిదశలోనే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో 18 మందిని పక్కకు తప్పించారు. నెల రోజుల తర్వాత ఈ మందు వాడిన వారిలో 13.9 శాతం రోగులు మరణించగా, ఈ మందు వాడని వారిలో 12.8 శాతం మంది మరణించారు. దీంతో ఈ మందు ప్రభావంపై అసంతృప్తిని, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ప్రయోగ ఫలితాల నివేదికను లోతుగా అధ్యయనం చేస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదే సమయంలో గణాంకాలన్నీ పూర్తిగా రాకుండానే అధ్యయనాన్ని తప్పులతో ప్రచురించారని జిలీడ్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తాము ఇప్పటికీ పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇవన్నీ అడ్వాన్డ్స్ స్టేజస్ లో ఉన్నాయని తెలిపారు.
ఏదైనా క్లినికల్ ట్రయల్ విజయవంతమైందా? లేదా? అని చెప్పడానికి ఈ గణాంకాలు ఎంతమాత్రమూ సరిపోవని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఫార్మకో ఎపిడమాలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు. అయితే, వైరస్ సోకిన తొలి నాళ్లలోనే రోగులలో ఈ మందు పనిచేస్తే కనుక, అ మందు వల్ల అంతగా ప్రయోజనం వుండదని ఆయన అన్నారు.
వాస్తవానికి ఇదే డ్రగ్ తో చికాగో హాస్పిటల్ లో కోతులతో పరిశోధన చేసిన సమయంలో మంచి ఫలితాలు కనిపించాయి. యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ సైతం ఈ డ్రగ్ ప్రభావం బాగుందని కితాబివ్వడంతో, 'రెమడీసివిర్'పై అన్ని దేశాలూ ఆశలను పెంచుకున్నాయి.
ఇదిలావుండగా, గతంలో ఇదే డ్రగ్ ను ఎబోలాపై ప్రయోగిస్తే, విఫలమైంది. ఈ వైరస్ ఆర్ఎన్ఏ, డీఎన్ఏలోని నాలుగు బిల్డింగ్ బ్లాక్స్ లో ఒకదానిలా వ్యవహరించి, వైరస్ జీనోమ్ లోకి చొచ్చుకుని వెళ్లి, దానిలోని పాథోజన్ ను నిలువరిస్తుందని, తద్వారా వైరస్ కణం మరో వైరస్ కణాన్ని పుట్టించలేదని పరిశోధకులు భావించారు. కానీ, హ్యూమన్ ట్రయల్స్ కు వచ్చేసరికి విఫలం కావడం గమనార్హం.