Devineni Uma: దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా?: జగన్‌కు చురకలు అంటించిన దేవినేని ఉమ
- ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తారు
- డాక్టర్లకి మాస్కులు కూడా అందించరు
- వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు
- రంగులు మార్చడానికి మళ్లీ రూ.కోట్లు ఖర్చు
‘దేవుడి స్క్రిప్ట్’ భలే ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలను కొన్నవారికి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నందుకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారని అప్పట్లో ఆయన అన్నారు. దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ మాటలను గుర్తు చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వ తీరుపై చురకలంటించారు.
'కరోనా క్లిష్ట సమయంలో ముందుండి నడిపించే ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తారు. డాక్టర్లకి మాస్కులు కూడా అందించరు, కానీ వేలకోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు వేసిన మీ పార్టీ రంగులు మార్చడానికి మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు?' అని దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు.