Telangana: బ్యాంకులో రూ. 1500 పడలేదా? ఈ ఫోన్ నంబర్ ను సంప్రదించండి!

Ration Card Holders Can Contact these Numbers if Not 1500 debited in Account

  • ఇప్పటికే లక్షల మంది ఖాతాల్లో నగదు
  • తమకు ఇంకా అందలేదంటున్న పలువురు
  • 040–23324614, 23324615 నంబర్లను సంప్రదించాలంటున్న అధికారులు

ఆహారభద్రత కార్డుదారులకు లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర సరుకుల నిమిత్తం రూ. 1,500 నగదు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ఇప్పటికే ఈ డబ్బు చేరిపోయింది. అయినప్పటికీ, వేల మంది తమకింకా డబ్బు అందలేదని ఆరోపిస్తున్న వేళ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుందని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.

బ్యాంక్ ఖాతాల్లో నగదు పడకుంటే, ల్యాండ్‌ లైన్‌ 040–23324614, 23324615 నంబర్లను గానీ, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967ను గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు. తపాలా శాఖ ద్వారా కూడా నగదును పంపిణీ చేస్తున్నామని రేషన్ కార్డును చూపించి నగదు పొందవచ్చని అంటున్నారు. ఈ నిర్ణయం బ్యాంకు ఖాతాలు లేని పేద కుటుంబాలకు మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నంబర్లకు ఫోన్ చేసి, రేషన్ కార్డు నంబర్ చెబితే, వారు పరిశీలించి, ఎవరి ఖాతాలో, ఏ బ్యాంకులో డబ్బు పడిందో వెల్లడిస్తారు. ఒకవేళ, డబ్బు పడకుంటే, అందుకు గల కారణాలను తెలుపుతారు. ఏ విధమైన బ్యాంకు ఖాతాతో సదరు కుటుంబం ఆధార్ కార్డు వివరాలు అటాచ్ కాకుంటే, పోస్టాఫీసుకు వెళ్లి రేషన్ కార్డును చూపిస్తే, వారు బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారని, అయితే, ఇంట్లోని కుటుంబ పెద్దగా కార్డులో గుర్తింపు పొందిన మహిళకు మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

బ్యాంకుల్లో డబ్బు పడని పేదలకు పోస్టాఫీసు ద్వారా రూ. 1,500 ఇచ్చే ప్రక్రియను హైదరాబాద్ లో ఇప్పటికే ప్రారంభించామని  అబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీసు(జీపీవో)లో చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జయరాజ్ వెల్లడించారు. కాగా, తెలంగాణలో 5.21 లక్షల మందికి పైగా రేషన్ కార్డు దారులకు బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామని, వీటిల్లో 1.62 లక్షల కుటుంబాలు హైదరాబాద్ లో ఉన్నాయని వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం, వీరికి అందించాల్సిన రూ. 78.24 కోట్ల మొత్తాన్ని తపాలా శాఖలో జమ చేసినట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News