Revanth Reddy: అర్నాబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

Congress MP Revanth Reddy complains on Arnab Goswami to Loksabha Speaker Om Birla
  • సోనియా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు 
  • మత విద్వేషం వెళ్లగక్కాడంటూ వ్యాఖ్యలు
  • ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలంటూ అభ్యర్థన
రిపబ్లిక్ టీవీ చానల్ అధినేత అర్నాబ్ గోస్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన అర్నాబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

"ఏప్రిల్ 21 సాయంత్రం రిపబ్లిక్ టీవీ చానల్లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సోనియాపై అర్నాబ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ ఎంపీ మాత్రమే కాదు, పార్లమెంటరీ పార్టీ నేత, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు. దేశం కోసం భర్తను, అత్తగారిని కూడా త్యాగం చేసిన ఓ ధీరవనితపై ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయం.

అర్నాబ్ గోస్వామి కుహనా పాత్రికేయంతో మత విద్వేషాన్ని వెళ్లగక్కాడన్నది అతను చేసిన దూషణల ద్వారా అర్థమవుతోంది. ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని పార్లమెంటు సభ్యుడిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దీన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు కూడా పంపాలని కోరుకుంటున్నాను" అంటూ రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.
Revanth Reddy
Om Birla
Loksabha Speaker
Sonia Gandhi
Arnab Goswami
Republic Tv

More Telugu News